-->

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కుమారుడు పుట్టాక ముఖం చాటేసిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కుమారుడు పుట్టాక ముఖం చాటేసిన భర్త


సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాతూరు గ్రామంలో ఓ యువతి తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు నాలుగు రోజులుగా నిరసన చేపట్టిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, కుమారుడు జన్మించిన తర్వాత తనను వదిలేసి వెళ్లిపోయాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది.

బాధితురాలు కన్నుముత్తుల గౌరి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామానికి చెందినది. గజ్వేల్‌లోని ఓ బ్యాంగిల్స్ స్టోర్‌లో పనిచేస్తున్న సమయంలో పాతూరు గ్రామానికి చెందిన సిగ్గిరెడ్డి అభిలాష్ రెడ్డి పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన అభిలాష్ రెడ్డి, గౌరిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

అయితే ఈ పెళ్లికి గౌరి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పటికీ, అభిలాష్ రెడ్డి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ఇద్దరూ 2023లో యాదగిరిగుట్ట దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని రామంతపూర్ ప్రాంతంలో నివాసం ఉంటూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగించారు.

వారి దాంపత్యానికి గుర్తుగా ఓ బాబు జన్మించాడు. ప్రస్తుతం ఆ బాలుడికి 9 నెలల వయస్సు ఉందని గౌరి తెలిపింది. ఇదిలా ఉండగా, రెండు నెలల క్రితం అభిలాష్ రెడ్డి కనిపించడం లేదంటూ అతని తల్లిదండ్రులు గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు అభిలాష్ రెడ్డిని పిలిపించి విచారించారు.

ఇదే సమయంలో బాలుడి అనారోగ్య కారణంగా గౌరి తన తల్లి ఇంటికి వెళ్లింది. అయితే అప్పటి నుంచి అభిలాష్ రెడ్డి తనతో మాట్లాడటం మానేశాడని, ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆమె ఆరోపించింది. సమస్యను పరిష్కరించేందుకు పెద్దమనుషులను ఆశ్రయించగా, ఇరువురు కుటుంబాల సమక్షంలో గజ్వేల్‌లో అద్దె ఇంట్లో ఉండేలా ఏర్పాటు చేసినప్పటికీ, అభిలాష్ రెడ్డి మళ్లీ తనను వదిలి పాతూరు గ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడని గౌరి వాపోయింది.

అంతేకాకుండా, తాము దళితులమని కులం పేరిట దూషిస్తున్నారని కూడా గౌరి ఆరోపించింది. భర్త, అత్తింటివారి ప్రవర్తనతో విసుగు చెందిన ఆమె.. 9 నెలల చిన్నారితో కలిసి పాతూరు గ్రామంలోని భర్త ఇంటి ఎదుటే నిరసన చేపట్టింది. అయితే ఆమె నిరసనకు భయపడి అభిలాష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

“నాకు, నా బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపను” అని గౌరి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793