-->

అడవిలో తవ్వుతుండగా బయటపడ్డ లంకెబిందెలు.. లోపల బంగారం, వజ్రాలా?

అడవిలో తవ్వుతుండగా బయటపడ్డ లంకెబిందెలు.. లోపల బంగారం, వజ్రాలా?


మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం సంచలనంగా మారింది. అడవిలో రహస్యంగా తవ్వకాలు జరిపిన సమయంలో రెండు పెద్ద మట్టి కుండలు బయటపడినట్లు, వాటిలో బంగారం, వజ్రాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతుండటంతో ప్రజల్లో ఆసక్తి, అనుమానాలు పెరుగుతున్నాయి.

స్థానిక సమాచారం ప్రకారం.. యర్రకుంట్ల సమీప అటవీ ప్రాంతంలో నెల రోజుల క్రితం ఈ తవ్వకాలు జరిగినట్లు చెబుతున్నారు. యర్రగొండపాలెంకు చెందిన కొందరు గుప్తనిధుల ముఠా సభ్యులు ఇచ్చిన సమాచారంతో తురిమెళ్ల అటవీశాఖ క్షేత్రస్థాయి అధికారులు, ట్రైబల్ వాచర్ల సహాయంతో తవ్వకాలు నిర్వహించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ తవ్వకాల సమయంలో రెండు పెద్ద లంకెబిందెలు బయటపడినట్లు, వాటిలో విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు లభించినట్లు ప్రచారం సాగుతోంది. బయటపడిన సంపదను తొలుత హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నించగా అది విఫలమై, అనంతరం బెంగళూరులో అమ్ముకున్నారని కూడా సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు.

ఇదిలా ఉండగా, తవ్వకాల సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మరింత చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై మీడియా అటవీశాఖ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు స్పందించలేదని తెలుస్తోంది.

గుప్తనిధుల తవ్వకాల సమాచారం పోలీసులకు చేరడంతో స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలు, ప్రచారంలో ఉన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల విచారణ అనంతరం అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793