తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న మెడికల్ దుకాణాల బంద్
హైదరాబాద్, మే 20: ఆన్‌లైన్ ఫార్మసీల ద్వారా జరుగుతున్న మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోనూ స్పష్టంగా కనిపించింది. తెలంగాణలో దాదాపు 25 వేలకుపైగా మెడికల్ దుకాణాలు మూతపడగా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 12 వేల మెడికల్ షాపులు తెరుచుకోలేదు.
ఆన్‌లైన్ మందుల అమ్మకాల వల్ల సంప్రదాయ మెడికల్ షాపుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కోట్లాది మంది ఉపాధి ప్రమాదంలో పడిందని వారు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో సరైన భౌతిక ధృవీకరణ లేకుండానే మందులు విక్రయిస్తున్నారని ఫార్మసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సృష్టించిన నకిలీ ప్రిస్క్రిప్షన్ల ద్వారా యాంటీబయాటిక్స్, మత్తు కలిగించే మందులు సులభంగా పొందుతున్నారని, ఇది ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోందని పేర్కొంటున్నారు.
పెద్ద కార్పొరేట్ ఆన్‌లైన్ సంస్థలు మందులపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ మార్కెట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయని, దీనివల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని చిన్న మెడికల్ షాపుల యజమానులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని వ్యాపారులు వాపోతున్నారు.
కోవిడ్-19 సమయంలో మందుల హోమ్ డెలివరీ కోసం కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా అమలు చేసిన అత్యవసర నోటిఫికేషన్లు GSR 220(E), GSR 817(E)లను ఇప్పటికీ కొనసాగించడం పట్ల కూడా అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ నిబంధనలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ డ్రగ్గిస్ట్స్ అండ్ ఫార్మాసిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ గుప్తా తెలిపారు.

Post a Comment