రేపటి నుంచి కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం సరస్వతీ అంత్య పుష్కరాల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. గురువారం నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల కోసం ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.
సరస్వతీ నది అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వర క్షేత్రం ఇప్పటికే విద్యుత్ వెలుగులతో అలంకరించబడింది. ఆలయ పరిసరాలు, ఘాట్లు, ప్రధాన రహదారులు భక్తులతో కిటకిటలాడనున్న నేపథ్యంలో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వైద్యశిబిరాలు, మొబైల్ టాయిలెట్లు, విశ్రాంతి కేంద్రాలు, అన్నదాన శాలలు ఏర్పాటు చేశారు.
ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించినట్లు సమాచారం. గత ఏడాది పుష్కరాల తరహాలోనే ఈసారి కూడా అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. దీంతో రెవెన్యూ, పోలీసు, ఎండోమెంట్స్, ఆర్టీసీ, విద్యుత్ తదితర శాఖల సిబ్బంది గత కొన్ని రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు పుష్కరాల సందర్భంగా కాళేశ్వరాన్ని సందర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గోదావరి తీరం వద్ద ప్రత్యేక హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టగా, వీఐపీ దర్శనాల కోసం ప్రత్యేక మార్గాలను సిద్ధం చేశారు. అదనపు పోలీసు బలగాలను మోహరించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేయనున్నారు.
పండితులు నిర్ణయించిన ప్రకారం రేపు తెల్లవారుజాము 5:43 గంటలకు సరస్వతీ అంత్య పుష్కరాల ముహూర్తం ప్రారంభం కానుంది. ఆ పవిత్ర సమయంలో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు సహకరించి అధికారుల సూచనలు పాటించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

Post a Comment