ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తు కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
కరీంనగర్, మే 20: కరీంనగర్ జిల్లా కేంద్ర పరిధిలోని ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తు కేంద్రంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులతో పాటు స్పేర్ పార్ట్స్, ట్రాన్స్‌ఫార్మర్లలో వినియోగించే ఆయిల్ డ్రమ్ములు నిల్వ ఉంచిన ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
ఎండల తీవ్రతతో పాటు గాలివేగం అధికంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదంలో ఆయిల్ డ్రమ్ములను మంటలు చుట్టుముట్టడంతో ఒక్కసారిగా భారీ శబ్దాలతో అవి పేలిపోయాయి. డ్రమ్ముల నుంచి ఆయిల్ చిమ్మిపడటంతో మంటలు మరింత విస్తరించాయి.
అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడటం, పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేకపోయినా, భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment