-->

వాహనాదారులకు బిగ్‌ షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

వాహనాదారులకు బిగ్‌ షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు


దేశవ్యాప్తంగా వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత పెరిగింది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే లీటరుకు రూ.3 మేర ధరలు పెంచిన చమురు సంస్థలు.. ఇప్పుడు మళ్లీ పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంచుతూ షాక్‌ ఇచ్చాయి.

నాలుగు రోజుల వ్యవధిలోనే రెండోసారి ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రవాణా ఖర్చులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత అధికమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.64కి చేరగా, డీజిల్‌ ధర రూ.91.58గా నమోదైంది. ఇక ముంబైలో పెట్రోల్‌ రూ.107.59, డీజిల్‌ రూ.94.08గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.70, డీజిల్‌ రూ.96.07కు పెరిగింది. అలాగే చెన్నైలో పెట్రోల్‌ రూ.104.49, డీజిల్‌ రూ.96.11కు చేరింది.

ధరల పెరుగుదలలో కోల్‌కతాలోనే అత్యధికంగా పెట్రోల్‌పై 96 పైసలు పెరిగినట్లు సమాచారం. ముంబైలో పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 94 పైసలు పెరగగా.. చెన్నైలో పెట్రోల్‌పై 82 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెరిగాయి.

కేవలం వారం రోజుల్లోనే రెండుసార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశముందన్న భయంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793