-->

దిగొచ్చిన సర్కారు!.. ఆర్టీసీ డ్రైవర్‌ తొలగింపుపై వ్యతిరేకతతో వెనక్కి

 

దిగొచ్చిన సర్కారు!.. ఆర్టీసీ డ్రైవర్‌ తొలగింపుపై వ్యతిరేకతతో వెనక్కి

కరీంనగర్‌, మే 26: జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ బైరి అశోక్‌ను విధుల నుంచి తొలగించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రైతుల సమస్యలపై మాట్లాడినందుకే నిరుపేద దళిత కుటుంబానికి చెందిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవడం పట్ల ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యతిరేకత పెరగడంతో ప్రభుత్వం చివరికి వెనక్కి తగ్గినట్టు సమాచారం.

సోమవారం జగిత్యాల తహసీల్‌ చౌరస్తా వద్ద పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కాంగ్రెస్‌ నేతలు ధర్నా నిర్వహిస్తుండగా, అక్కడుగా బస్సు నడుపుకుంటూ వెళ్తున్న అశోక్‌ “వడ్లు, మక్కల సంగతి చూడండి.. పెట్రోల్‌ ధరలు ఎప్పుడైనా తగ్గించవచ్చు” అని వ్యాఖ్యానించారు. రైతులు పంటలు అమ్ముకోలేక పడుతున్న ఇబ్బందులను ఉద్దేశించి మాట్లాడిన ఈ వ్యాఖ్యలను అధికారులు తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నాయకులను విమర్శించారంటూ ధర్మపురి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు చేసిన ఫిర్యాదు మేరకు ఆర్టీసీ అధికారులు అశోక్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, కరీంనగర్‌ తదితర ఐదు డిపోల పరిధిలోని అద్దె బస్సుల్లో కూడా ఆయనను డ్రైవర్‌గా నియమించొద్దని ఆదేశించినట్టు సమాచారం.

ఈ చర్యపై బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు తదితరులు ఆర్టీసీ అధికారులను కలిసి అశోక్‌పై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. “రైతుల సమస్యలు ప్రస్తావించడం తప్పా?” అంటూ ప్రశ్నించారు.

సోషల్‌ మీడియాలో కూడా ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. “వడ్లు, మక్కలు కొనాలని అడిగితే ఉద్యోగం తీసేస్తారా?” అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. అద్దె ఇంట్లో కుటుంబాన్ని పోషిస్తున్న పేద డ్రైవర్‌పై ఇంత కఠిన చర్య ఎందుకని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యతిరేకత ఊపందుకోవడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. అశోక్‌ నుంచి సంజాయిషీ తీసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అధికారులకు సూచనలు వెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలో అధికారులు అశోక్‌ను పిలిపించి, క్షమాపణ లేఖ ఇచ్చి విధుల్లో చేరాలని సూచించినట్టు తెలిసింది.

అయితే “నేను ఎలాంటి తప్పూ చేయలేదు. రైతుల గోస గురించి మాత్రమే మాట్లాడాను. ఏ రాజకీయ పార్టీని గానీ, నాయకుడిని గానీ విమర్శించలేదు” అంటూ అశోక్‌ స్పష్టం చేసినట్టు సమాచారం. తొలగింపు ఉత్తర్వులు లిఖితపూర్వకంగా ఇచ్చిన అధికారులు, తిరిగి విధుల్లో చేరాలనే విషయాన్ని మాత్రం నోటిమాటగానే చెప్పారని తెలుస్తోంది.

ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, రైతు సమస్యలపై మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడం సరైందా కాదా అనే అంశంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793