పింఛన్ దారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
తెలంగాణలో పింఛన్‌ల పంపిణీ విధానంలో కీలక మార్పులు చేయాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై పింఛన్‌లను పోస్టల్ శాఖ ద్వారా కాకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే అర్హులకే పింఛన్‌లు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా సమయానికి జీతాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందుకోసం ప్రతినెలా రూ.50 కోట్లు ప్రత్యేక నిధులుగా విడుదల చేస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలోని సుమారు 50 వేల మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖునే వేతనాలు అందాలని సీఎం ఆదేశించారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా అన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోమని అధికారులకు హెచ్చరించారు.
అదేవిధంగా గ్రామ పంచాయతీల ఆర్థిక స్వతంత్రతను బలోపేతం చేసే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వం తొలగించిన నిబంధనలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70(3) ప్రకారం గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాల్లో కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా సవరణలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పెన్షన్‌ల క్రమబద్ధీకరణలో భాగంగా ఓటర్ ఐడీ, ఆధార్, SEEEPC సర్వే డేటా ఆధారంగా అర్హులను గుర్తించాలని సీఎం సూచించారు. కొత్త పింఛన్‌ల మంజూరులో ఒంటరి మహిళలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment