భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సాల్కలాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బుధవారం రాత్రి మృతి చెందారు.
స్థానిక సమాచారం ప్రకారం, నరసింహ అనే వ్యక్తి సాల్కలాపూర్ గ్రామంలో మామిడి తోటను కౌలుకు తీసుకొని కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఏమైందో తెలియదు కానీ, ముందుగా తన భార్య హేమలతకు ఉరివేసి హత్య చేసిన అనంతరం ఇద్దరు పిల్లలు సాయి నిహాల్, సాయిశ్రీలను సంపులో పడేసి చంపినట్లు తెలుస్తోంది.
అనంతరం నరసింహ తాను కూడా చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అప్పుల బాధ కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post a Comment