-->

అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలు బలి.. ఇద్దరు చిన్నారులు అనాథలు

అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలు బలి.. ఇద్దరు చిన్నారులు అనాథలు


వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట శివారులో జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నాంచారిమడూర్‌లోని ఓ రైస్ మిల్లుకు ధాన్యం లోడ్‌తో ట్రాక్టర్ వెళ్తుండగా, అదే దారిలో ఆర్15 హెవీ స్పీడ్ బైక్‌పై ముగ్గురు యువకులు వరంగల్ వైపు ప్రయాణిస్తున్నారు. వెలికట్ట గ్రామ శివారుకు చేరుకున్న సమయంలో బైక్ అదుపుతప్పి ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతులను దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన అల్లి సంపత్(25), లింగమల్ల సతీష్(28), పొట్టకర్ల వంశీ(22)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ముగ్గురు యువకులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో బొడ్లాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదిలా ఉండగా మృతుడు సతీష్ కుటుంబ పరిస్థితి మరింత హృదయ విదారకంగా మారింది. మూడేళ్ల క్రితమే సతీష్ భార్య మృతి చెందగా, అతను తన కుమారుడు, కుమార్తెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రమాదంలో సతీష్ కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.

అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793