చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ, విధుల నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు.
అదేవిధంగా వాహనాల తనిఖీల సమయంలో మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతో పాటు, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చెక్‌పోస్ట్ వద్ద సీసీ కెమెరాల పనితీరు, రికార్డుల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను కూడా ఎస్పీ పరిశీలించారు.
విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తతతో పనిచేస్తే నేర నియంత్రణలో మంచి ఫలితాలు సాధించవచ్చని ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

Post a Comment