-->

NH-44 రోడ్డుపై లారీ టైర్ బ్లాస్ట్.. ఒకదానికొకటి ఏడు కార్లు ఢీ

NH-44 రోడ్డుపై లారీ టైర్ బ్లాస్ట్.. ఒకదానికొకటి ఏడు కార్లు ఢీ

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి సమీపంలోని NH-44పై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ టైర్ పేలిపోవడంతో జరిగిన ఈ ప్రమాదంలో వరుసగా ఏడు కార్లు, ఓ ఎరువుల లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనతో హైవేపై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ చంద్రాయన్‌పల్లి వద్దకు చేరుకోగానే టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదాన్ని గమనించిన వెనుక వస్తున్న కార్ల డ్రైవర్లు వెంటనే వేగం తగ్గించారు.

అయితే కార్ల వెనుక యూరియా సంచులతో వస్తున్న మరో లారీ వేగాన్ని అదుపులోకి తేవలేక ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో వరుసగా ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొని తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.

ఈ ఘటనలో ఏడుగురు స్వల్ప గాయాలతో బయటపడగా, సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు NH-44పై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇందల్వాయి ఎస్‌ఐ సందీప్ తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793