ఉయ్యాల ఊగుతూ విషాదం.. చీర మెడకు చుట్టుకుని 11 ఏళ్ల బాలిక మృతి
ఉయ్యాల ఊగుతూ విషాదం.. చీర మెడకు చుట్టుకుని 11 ఏళ్ల బాలిక మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉయ్యాల ఊగుతూ ప్రమాదవశాత్తు చీర మెడకు చుట్టుకోవడంతో 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండలం కప్రాయపల్లి గ్రామంలో చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గ్రామానికి చెందిన పుడుత శంకర్, మమత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వేసవి సెలవుల కారణంగా పిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. వీరి రెండో కుమార్తె తేజశ్రీ (11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది.
సోమవారం ఇంట్లో ఆడుకుంటున్న తేజశ్రీ, ఇంటి మధ్య గదిలో సీలింగ్ రాడ్డుకు చీరతో ఉయ్యాల కట్టుకుని ఊగుతోంది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు చీర మెలిక తిరిగి బాలిక మెడకు బిగుసుకుపోయింది. ఇంటి ముందు పనుల్లో నిమగ్నమైన తల్లి మమతకు ఈ విషయం తెలియలేదు.
కొంతసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లిన తల్లి, కూతురు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి ఆందోళనకు గురైంది. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని బాలికను వెంటనే బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తున్న మార్గమధ్యలోనే తేజశ్రీ మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. క్షణాల్లో జరిగిన ప్రమాదం తల్లిదండ్రులను శోకసంద్రంలోకి నెట్టింది. చిన్నారి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో కూడా విషాద వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోచంపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment