తెలంగాణలో భారీ నకిలీ డీఏపీ ఎరువుల ముఠా గుట్టురట్టు.. రూ.2 కోట్ల సామగ్రి స్వాధీనం
హుజూర్‌నగర్: తెలంగాణలో డీఏపీ (అడుగుమందు) కొరతను ఆసరాగా చేసుకుని రైతులను మోసం చేస్తున్న భారీ నకిలీ ఎరువుల ముఠాను పోలీసులు ఛేదించారు. శుక్రవారం కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, హుజూర్‌నగర్ సీఐ జి. చరమందరాజు వివరాలు వెల్లడించారు.
మట్టంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డి రైతులకు నకిలీ డీఏపీ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వ్యవసాయ శాఖ అధికారి బొలిశెట్టి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, వికారాబాద్, కర్నూలు, గద్వాలతో పాటు కర్ణాటక వరకు విస్తరించిన నకిలీ డీఏపీ సరఫరా నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన యూనిట్‌లో వివిధ రాష్ట్రాల నుంచి ముడిసరుకు తెప్పించి నకిలీ డీఏపీ తయారు చేసి, అసలైన ఎరువుల పేరుతో రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను పరీక్షించగా అవి నకిలీవేనని నిర్ధారణ అయింది.
స్వాధీనం చేసుకున్నవి:
- ఒక డీసీఎం వాహనం
- మారుతి ఎర్టిగా కారు
- 5 సెల్‌ఫోన్లు
- 4,000–5,000 నకిలీ డీఏపీ బస్తాలు
- ఎరువుల తయారీ యంత్రాలు
- ప్రింటింగ్ మిషన్లు
- పాలిథిన్, కటింగ్ మిషన్
- ఎలక్ట్రానిక్ తూకం
- కలర్ ప్రింటింగ్ సామగ్రి
- నాలుగు కుట్టు మిషన్లు
స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.
రైతులు ఎరువులను అధికారిక డీలర్ల వద్ద నుంచే కొనుగోలు చేసి, తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

Post a Comment