తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం.. లోగో ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత
తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం.. లోగో ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అనుబంధ కార్మిక విభాగమైన **తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ)**ను అధికారికంగా ఆవిష్కరించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత టీఆర్టీయూ లోగోను ఆవిష్కరించి, కార్మిక లోకానికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణే టీఆర్టీయూ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన కార్మికులకు అండగా నిలిచే పార్టీ అని, భవిష్యత్తులో అధికారంలోకి వస్తే కార్మికులకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పారు.
టీఆర్టీయూ లోగోలో ఒకవైపు పెన్ను, మరోవైపు పాణా (స్పానర్) ఉండటం అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులకు పార్టీ అండగా ఉంటుందనే సంకేతమని వివరించారు.
దేశంలో కార్మిక చట్టాలు, ట్రేడ్ యూనియన్ల హక్కులను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. కార్మికుల హక్కుల రక్షణకు ట్రేడ్ యూనియన్లు అత్యంత అవసరమని, ప్రభుత్వమే కార్మికుల శ్రమను దోచుకుంటూ ప్రైవేట్ సంస్థలకు దోపిడీ మార్గం చూపుతోందని విమర్శించారు.
అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలకు దిగాల్సిన పరిస్థితి నెలకొందని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ట్రేడ్ యూనియన్ హక్కులను కాపాడేందుకు తెలంగాణ రక్షణ సేన పోరాడుతుందని స్పష్టం చేశారు.
1926 నుంచే ట్రేడ్ యూనియన్ చట్టాలు కార్మికులకు రక్షణగా నిలిచాయని, అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్‌ల ద్వారా కార్మిక హక్కులను బలహీనపరుస్తోందని ఆరోపించారు. ఈ చట్టాలను బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు అమలు చేయబోమని ప్రకటించినట్లు పేర్కొంటూ, తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి స్పష్టమైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనాల అంశాన్ని ప్రస్తావిస్తూ, గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు పరిశ్రమల కార్మికులకు రూ.20 వేల కనీస వేతనం ఉండాలని డిమాండ్ చేశారని, ప్రస్తుతం రూ.16 వేల ప్రతిపాదన అన్యాయమని విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన తరఫున కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్లపై అధికంగా చలాన్లు విధించడం వల్ల వారి జీవనం భారంగా మారిందని, ప్రభుత్వాలు ఎల్లప్పుడూ పేదలు, కార్మికులు, ఉద్యోగుల పక్షాన నిలవాలని కవిత అన్నారు.
ఐటీ, ఫార్మా రంగాల్లో కూడా ఉద్యోగ భద్రత కోసం ట్రేడ్ యూనియన్లు అవసరమని పేర్కొన్న ఆమె, తమ పార్టీలో ఐటీ రంగానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇటీవల జీనోమ్ వ్యాలీలో తెలుగు ఉద్యోగులను తొలగించిన ఘటనను ప్రస్తావిస్తూ, యూనియన్లు లేకపోవడం వల్లే ఉద్యోగులను ఇష్టానుసారంగా తొలగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా, భద్రంగా పనిచేసే వాతావరణం కల్పించినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని కవిత పేర్కొన్నారు.

Post a Comment