భద్రాచలంలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
భద్రాచలంలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
శనివారం ఉదయం 6 గంటల నాటికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55.10 అడుగులకు చేరుకుంది. నదిలో 15,40,412 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 53 అడుగులను నీటిమట్టం దాటడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
గోదావరి వరద హెచ్చరికల్లో మొదటి హెచ్చరిక 43 అడుగుల వద్ద (9,32,288 క్యూసెక్కులు), రెండో హెచ్చరిక 48 అడుగుల వద్ద (11,44,645 క్యూసెక్కులు), మూడో హెచ్చరిక 53 అడుగుల వద్ద (14,26,684 క్యూసెక్కులు) అమలులోకి వస్తుంది. ప్రస్తుతం నీటిమట్టం మూడో హెచ్చరిక స్థాయిని దాటడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
గోదావరి తీర ప్రాంత గ్రామాల ప్రజలు అనవసరంగా నది వద్దకు వెళ్లవద్దని, చేపల వేట, పడవ ప్రయాణాలు పూర్తిగా నిలిపివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
కాగా, భద్రాచలం వద్ద గతంలో నమోదైన అత్యధిక వరద 1986లో సంభవించింది. ఆ సమయంలో గోదావరి నీటిమట్టం 75.60 అడుగులకు చేరుకోగా, 27.02 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. అలాగే 2022లో నీటిమట్టం 71.30 అడుగులకు, ప్రవాహం 24.43 లక్షల క్యూసెక్కులకు చేరి భారీ వరద పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల తదితర గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.

Post a Comment