-->

5వ అంతస్తు నుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య

5వ అంతస్తు నుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య
 5వ అంతస్తు నుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ వైద్య విద్యార్థిని అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామానికి చెందిన వడ్లకొండ ఆనందచారి, ఆయన భార్య అరుణ కుటుంబంతో కలిసి నాగారం వెస్ట్‌ గాంధీనగర్‌లోని భవానీ ప్యారడైజ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. వారి కుమార్తె వడ్లకొండ దీక్షిత (28) ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, ఆరు నెలల క్రితం కర్ణాటకలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నది.

ఈ నెల 17న సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చిన దీక్షిత, శుక్రవారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దీక్షిత ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎలాంటి కుటుంబ కలహాలు లేవని, ఎవరి పట్లా తమకు అనుమానాలు లేవని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793