ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్ టైరు కింద నలిగి యువతి మృతి మరో యువతికి గాయాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్ టైరు కింద నలిగి యువతి మృతి మరో యువతికి గాయాలు
హైదరాబాద్, గచ్చిబౌలి: గచ్చిబౌలి పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందగా, మరో యువతి తీవ్రంగా గాయపడింది. వేగంగా వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన మల్లం భవాని (23) హైదరాబాద్‌లోని ఇందిరానగర్ పీజీ హాస్టల్‌లో ఉంటూ టెలికాంనగర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. మరోవైపు ఎస్. సుహాసిని (30) అంజయ్యనగర్‌లోని లక్ష్మీ హాస్టల్‌లో నివసిస్తూ అదే సంస్థలో ఉద్యోగం చేస్తోంది.
గురువారం రాత్రి సుమారు 11:20 గంటల సమయంలో ఇద్దరూ భోజనం కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ వారి వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న భవాని ట్యాంకర్ వెనుక టైరు కింద పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. వాహనం నడుపుతున్న సుహాసిని తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించగా, ఆమెకు చికిత్స కొనసాగుతోంది.
సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment