ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గంజాయి స్మగ్లింగ్.. ఈగల్ ఫోర్స్ ఆపరేషన్‌లో ముగ్గురి అరెస్టు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గంజాయి స్మగ్లింగ్.. ఈగల్ ఫోర్స్ ఆపరేషన్‌లో ముగ్గురి అరెస్టు
హైదరాబాద్, జూలై 13: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డాగా చేసుకుని గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా వ్యవహారాన్ని ఈగల్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ ద్వారా బట్టబయలు చేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న బాబా బోలేనాధ్ ట్రావెల్స్ బస్సును వనస్థలిపురం సమీపంలో తనిఖీ చేసి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో బస్సు డ్రైవర్ కోమ్లకిల్, కండక్టర్ బాబు మడకామి, హెల్పర్ లక్ష్మణ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన బస్సును కూడా సీజ్ చేశారు.
ప్రాథమిక విచారణలో గంజాయి స్మగ్లర్లు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లకు భారీ కమీషన్లు ఆశ చూపించి అక్రమ రవాణాకు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మల్కన్‌గిరి నుంచి గంజాయిని బస్సులో ఎక్కించిన ప్రధాన స్మగ్లర్ నుబీన్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment