-->

అప్పుల వేధింపులు తాళలేక ఒకే కుటుంబం ఆత్మహత్యాయత్నం.. చిన్నారి పరిస్థితి విషమం

అప్పుల వేధింపులు తాళలేక ఒకే కుటుంబం ఆత్మహత్యాయత్నం.. చిన్నారి పరిస్థితి విషమం


అప్పుల వేధింపులు తాళలేక ఒకే కుటుంబం ఆత్మహత్యాయత్నం.. చిన్నారి పరిస్థితి విషమం

నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో అప్పుల వేధింపులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన మల్యాల గ్రామానికి చెందిన కుటుంబంలో చోటుచేసుకున్నట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మల్యాల గ్రామానికి చెందిన వడ్డె రామసుబ్బడు ఏడేళ్ల క్రితం నన్నూరు నుంచి వచ్చి గ్రామంలో స్థిరపడ్డాడు. బొలెరో వాహనాన్ని బాడుగకు తిప్పుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఆ వాహనాన్ని మైక్రో ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయగా, రెండు నెలల కంతులు చెల్లించలేకపోయాడు. దీంతో ఇటీవల ఫైనాన్స్ సంస్థ సిబ్బంది వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వాహనం కోల్పోవడంతో ఉపాధి లేక తీవ్ర మనస్తాపానికి గురైన రామసుబ్బడు గ్రామంలోని కొందరి వద్ద కూడా అప్పులు చేశాడు. అప్పులదారుల వేధింపులు పెరగడంతో తీవ్ర నిరాశకు గురైన అతడు తన భార్య మాధవి, కుమార్తెలు జయతేజ, అక్షయతో కలిసి బుధవారం పాములపాడు మండలం ఎర్రగూడూరు సమీపంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద గడ్డిమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

అనంతరం బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే 108 అంబులెన్స్‌లో బాధితులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబంలోని చిన్న కుమార్తె అక్షయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, కాల్‌మనీ నిర్వాహకుల వేధింపులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

గమనిక: ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిస్థితులకు దారితీసిన కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793