నీట్ ఆందోళనపై కేంద్రంపై కవిత విమర్శలు.. విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన తెలంగాణ రక్షణ చీఫ్
నీట్ ఆందోళనపై కేంద్రంపై కవిత విమర్శలు.. విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన తెలంగాణ రక్షణ చీఫ్
హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై జరిగిన చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆమె విమర్శించారు.
నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థులపై దాష్టీకానికి పాల్పడిందని కవిత ఆరోపించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థినులను రోడ్లపై పరుగెత్తించి, రక్తం వచ్చేలా కొట్టడం అత్యంత అమానుషమని పేర్కొన్నారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులపై ఇలాంటి చర్యలు ప్రపంచ దేశాల ముందు దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆమె అన్నారు.
నీట్ పేపర్ లీకేజీ కారణంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని, 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొంటూ, ఈ ఘటనలకు బాధ్యులు ఎవరో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీకి కారణమైన వారిని గుర్తించి అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని, మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కవిత కోరారు.
విద్యార్థుల హక్కులకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను దేశ ప్రజలు గమనిస్తున్నారని, విద్యార్థులపై విరిగిన ప్రతి లాఠీకి, చిందిన ప్రతి రక్తపు బొట్టుకు ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెబుతారని కవిత వ్యాఖ్యానించారు.

Post a Comment