-->

దొంగతనం కేసులో మరో అరెస్ట్.. శంకర్ లాల్‌కు సహకరించిన మహిళ రిమాండ్‌కు

 

దొంగతనం కేసులో మరో అరెస్ట్.. శంకర్ లాల్‌కు సహకరించిన మహిళ రిమాండ్‌కు

దొంగతనం కేసులో మరో అరెస్ట్.. శంకర్ లాల్‌కు సహకరించిన మహిళ రిమాండ్‌కు

కరీంనగర్, జూలై 31: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన రూ.26 లక్షల దొంగతనం కేసులో కరీంనగర్ రూరల్ పోలీసులు మరో నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన తగరం శంకర్ లాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

గురువారం మధ్యాహ్నం కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో ఆమె కేశవపట్నం మండలం చింతగుట్టపల్లి గ్రామానికి చెందిన ఆడెపు రేష్మా అని, ప్రధాన నిందితుడు తగరం శంకర్ లాల్‌కు సన్నిహితురాలని వెల్లడించింది. శంకర్ లాల్ అరెస్ట్ విషయం పత్రికలు, టీవీ వార్తల ద్వారా తెలుసుకుని, తనను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో బంధువుల ఇంటికి వెళ్లేందుకు చంద్రాపూర్ వెళ్లే రైలు కోసం రైల్వే స్టేషన్‌లో వేచి ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.

తదుపరి విచారణలో దొంగతనం జరిగిన రోజున తాను కూడా శంకర్ లాల్‌తో కలిసి తీగలగుట్టపల్లిలోని ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఇంటిలోకి ప్రవేశించి, ఇంటి తాళాలు, బాత్రూమ్ తాళం పగులగొట్టి, ప్లాస్టిక్ నీటి ఖాళీ డ్రమ్ములో దాచిన సుమారు రూ.26 లక్షల నగదును అపహరించినట్లు అంగీకరించింది.

దొంగిలించిన నగదులో తనకు కూడా వాటా ఇస్తానని శంకర్ లాల్ హామీ ఇచ్చాడని, అయితే తర్వాత తన గ్రామానికి వెళ్లిపోయి డబ్బు పంపలేదని తెలిపింది. శంకర్ లాల్‌తో నిరంతరం మాట్లాడేందుకు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కూడా స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగించింది.

నిందితురాలి అంగీకార వాంగ్మూలం ఆధారంగా పంచనామా నిర్వహించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించిన మిగిలిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793