బీఆర్ఎస్‌లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్‌లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన మృతితో బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ నెల 26న హనుమకొండ హంటర్ రోడ్డులోని తన నివాసంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించగా, వైద్యులు గంటపాటు సీపీఆర్ నిర్వహించి గుండె స్పందనను పునరుద్ధరించారు. అనంతరం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో తీవ్ర బ్లాకులు ఉన్నట్లు గుర్తించారు.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గ్రీన్ చానెల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్‌లో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎక్మో (ECMO) సాయంతో అత్యాధునిక వైద్య చికిత్స అందించినప్పటికీ ఆయన శరీరం చికిత్సకు స్పందించలేదని వైద్యులు తెలిపారు. చివరకు గురువారం అర్ధరాత్రి ఆయన మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా యశోద ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ చికిత్స అందించాలని కోరారు. అలాగే కేటీఆర్, హరీశ్ రావు కూడా ప్రత్యేకంగా వైద్య సేవలపై పర్యవేక్షణ చేసినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.
శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామమైన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి తరలించనున్నారు. అక్కడ అభిమానులు, కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఉద్యమకారుడి నుంచి ఎమ్మెల్యే వరకు...
1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. మొదట కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన, 2001లో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్‌లో చేరి ఉద్యమంలో కీలకంగా పనిచేశారు.
గులాబీ పార్టీ తరఫున తొలిసారిగా జడ్పీటీసీగా ఎన్నికైన ఆయన, 2017లో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి చేతిలో ఓటమి పాలైనప్పటికీ, ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక నాయకుడిని కోల్పోయినట్లు పలువురు నేతలు, ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Post a Comment