పెళ్లి పేరుతో మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావుపై కేసు.. యువతి ఫిర్యాదు
పెళ్లి పేరుతో మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావుపై కేసు.. యువతి ఫిర్యాదు
హైదరాబాద్: బీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావుపై ఓ యువతి సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేసి, లైంగికంగా దోపిడీ చేసి మోసం చేశారని ఆమె ఆరోపించింది.
నాంపల్లిలోని XIV అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నంబర్ 589/2026 నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69, 351(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం.. 2022లో ఇంటర్వ్యూ నిమిత్తం రేగా కాంతా రావును కలిసిన తర్వాత పరిచయం వ్యక్తిగత సంబంధంగా మారింది. కొత్త యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు పేరుతో తరచూ కలుస్తూ, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనను లైంగికంగా దోపిడీ చేశారని ఆమె ఆరోపించారు.
అమీర్‌పేటలోని ఓ ఫ్లాట్‌లో తాము సహజీవనం చేసినట్లు, హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా ఆయన అక్కడే ఉండేవారని తెలిపారు. తన వ్యక్తిగత ఫోటోలను చూపించి బెదిరించేవారని, 2025 మధ్యకాలం వరకు ఈ సంబంధం కొనసాగిందని పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ పెట్టుబడి పేరుతో తన వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకున్నారని, అనంతరం తనకు దూరంగా ఉంటూ ఫోన్ కాల్స్‌కు స్పందించడం మానేశారని ఆరోపించారు. తన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఆయన సన్నిహితుల ద్వారా రూ.8.5 లక్షలు తిరిగి అందినప్పటికీ, తనకు డబ్బు కంటే పెళ్లి పేరుతో మోసం చేయడమే ప్రధాన వేదన అని బాధితురాలు వెల్లడించారు.
అంతేకాకుండా గతంలో షీ టీమ్స్‌కు కూడా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగకుండా రక్షణ కల్పించి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
గమనిక: ఇవి ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, వాటి నిజానిజాలు అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.

Post a Comment