తెలంగాణ జలాశయాలకు జలకళ.. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు
తెలంగాణ జలాశయాలకు జలకళ.. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు
హైదరాబాద్, జులై 30 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలతో నదులు, ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి, ప్రాణహిత నదులకు వరద ఉధృతి పెరిగింది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతుండగా జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈ పరిణామం రైతులు, ప్రజల్లో ఆనందాన్ని నింపుతోంది.
నిజామాబాద్ జిల్లాలోని ప్రతిష్టాత్మక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ)లోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 12,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, నీటి నిల్వ 17.103 టీఎంసీలకు చేరుకుంది. కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్‌ఫ్లో దాదాపు 10 వేల క్యూసెక్కులకు చేరగా, ప్రాజెక్టు నీటి నిల్వ అర టీఎంసీని దాటింది. జిల్లాలోని మరో కీలక ప్రాజెక్టు కడెంకు వరద ఉధృతి మరింత పెరిగింది.
గురువారం ఉదయం 11 గంటల సమయానికి కడెం ప్రాజెక్టులోకి 77,442 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం వద్ద నీటిమట్టం 6.320 మీటర్లకు చేరడంతో నదీతీరం సందడిగా మారింది.
గోదావరి వరద ఉధృతి కారణంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) సూచనల మేరకు అధికారులు బ్యారేజ్‌లోని మొత్తం 85 గేట్లను ఎత్తి ఉంచారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ సమానంగా 1,01,530 క్యూసెక్కులుగా కొనసాగుతుండటంతో గోదావరి ప్రవాహం వేగంగా దిగువకు సాగుతోంది.
రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment