-->

పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు.. స్తంభించిన రాకపోకలు, రైతుల్లో ఆందోళన

 

పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు.. స్తంభించిన రాకపోకలు, రైతుల్లో ఆందోళన

పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు.. స్తంభించిన రాకపోకలు, రైతుల్లో ఆందోళన

పెద్దపల్లి జిల్లా, జులై 30: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లాలో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

మంథని మండల కేంద్రంలోని బొక్కల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు నీరు పంట పొలాల్లోకి చేరడంతో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటితో పొలాల్లో మట్టి పేరుకుపోయి దిగుబడిపై ప్రభావం పడుతుందని వారు చెబుతున్నారు.

ముత్తారం మండలం ఓడేడు గ్రామం నుంచి భూపాలపల్లి జిల్లా గ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడంతో గరిమెళ్లపల్లి, ఎంచపెల్లి, టేకుమట్ల తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అదేవిధంగా మంథని మండలం విరోచవరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేయడంతో గ్రామం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయింది.

ఇక కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని హుస్సేన్ మియా వాగు కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మానేరు జలాలతో పాటు పంట పొలాల నుంచి వచ్చిన వరద నీరు వాగులో కలవడంతో నీటి ప్రవాహం మరింత పెరిగింది. దీంతో గోదావరిఖని, మంథని, ముత్తారం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, చెక్‌డ్యామ్‌లు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే పరిస్థితిని జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతోంది.

Blogger ఆధారితం.