పశువుల సంతను తలపిస్తున్న మంథని అంబేద్కర్ చౌక్.. వాహనదారులకు తప్పని తిప్పలు
పశువుల సంతను తలపిస్తున్న మంథని అంబేద్కర్ చౌక్.. వాహనదారులకు తప్పని తిప్పలు
పెద్దపల్లి జిల్లా, జూలై 23: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్, బస్టాండ్ ప్రాంతాలు నిత్యం రోడ్లపై సంచరించే పశువులతో పశువుల సంతను తలపిస్తున్నాయి. రోడ్లపై యథేచ్ఛగా వదిలేస్తున్న పశువుల కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పశువుల యజమానులు వాటిని నిర్లక్ష్యంగా రోడ్లపై వదిలేయడంతో పగలు మాత్రమే కాకుండా రాత్రి వేళల్లో కూడా అవి ప్రధాన రహదారులపైనే సంచరిస్తూ, అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాయి. దీంతో రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
అంబేద్కర్ చౌరస్తా, బస్టాండ్ పరిసరాల్లో ఎప్పుడూ పశువులు గుంపులుగా తిరుగుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ద్విచక్ర వాహనదారులు పశువులను తప్పించే క్రమంలో అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.
కొన్ని సందర్భాల్లో పశువులు రహదారిపైనే పరస్పరం పోట్లాడుకోవడంతో వాటి సమీపంలో వెళ్తున్న వాహనాలపై పడే ప్రమాదం ఏర్పడి, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్న పశువుల సమస్యపై మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టి, పశువుల యజమానులకు నోటీసులు జారీ చేసి, రోడ్లపై పశువులను వదిలే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Post a Comment