ఆ బడిలో ఒక్క విద్యార్థి.. అతడికోసం టీచర్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది సేవలు
ఆ బడిలో ఒక్క విద్యార్థి.. అతడికోసం టీచర్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది సేవలు!
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితికి అద్దం పట్టే ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని కోనాపురం ప్రాథమిక పాఠశాలలో కనిపిస్తోంది. ఈ పాఠశాలలో ప్రస్తుతం ఒకే ఒక్క విద్యార్థి చదువుతుండగా, అతడి కోసం ఉపాధ్యాయుడితో పాటు వంట మనిషి, పనిమనిషి సేవలు అందిస్తున్నారు.
కోనాపురం గ్రామానికి చెందిన ఈరెల్లి ప్రవీణ్ కుమారుడు ఈరెల్లి విక్కీపాల్ ఈ పాఠశాలలో రెండో తరగతి తెలుగు మాధ్యమంలో చదువుతున్న ఏకైక విద్యార్థి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఏకోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న జగన్మోహన్ రావు విక్కీపాల్‌కు అన్ని సబ్జెక్టులను స్వయంగా బోధిస్తున్నారు. బాలుడు ఏదైనా రోజు పాఠశాలకు రాకపోతే ఇంటికి వెళ్లి అతడిని బుజ్జగించి తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు.
ఒకప్పుడు ఈ పాఠశాలలో సుమారు 20 మంది విద్యార్థులు చదివేవారు. అయితే గ్రామంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కుటుంబాలు పట్టణాలకు వలస వెళ్లాయి. దీంతో పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు వెళ్లిపోవడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. గత విద్యా సంవత్సరంలో ముగ్గురు విద్యార్థులు ఉండగా, వారిలో ఇద్దరూ వలస వెళ్లడంతో ఈ విద్యా సంవత్సరంలో విక్కీపాల్ ఒక్కరే మిగిలిపోయాడు.
ప్రస్తుతం ఈ ఒక్క విద్యార్థి కోసం ప్రధానోపాధ్యాయుడితో పాటు మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట మనిషి, పాఠశాల నిర్వహణ చూసుకునే పనిమనిషి విధులు నిర్వహిస్తున్నారు. అంటే ఒక్క విద్యార్థికి మొత్తం ముగ్గురు సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ఈ పాఠశాల నిర్వహణ కోసం ప్రతి నెల సుమారు రూ. లక్ష వరకు ఖర్చవుతోందని ప్రధానోపాధ్యాయుడు వెల్లడించారు.
గ్రామంలో ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మెరుగుపడితే వలసలు తగ్గి, పిల్లలు తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. లేదంటే విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment