తల్లిపాలే శిశువుకు రక్ష: ఆగస్టు 1 నుంచి 7 వరకు మంత్రి సీతక్క
తల్లిపాలే శిశువుకు రక్ష: ఆగస్టు 1 నుంచి 7 వరకు మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 2: ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి అనసూయ (సీతక్క) తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ప్రతి తల్లి, కుటుంబం తల్లిపాల అవసరాన్ని అర్థం చేసుకుని శిశువుల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆమె పేర్కొన్నారు. శిశువు పుట్టిన గంటలోపే తల్లిపాలను ప్రారంభించాలని, తొలి ఆరు నెలల పాటు ఎలాంటి ఇతర ఆహారం లేదా నీరు ఇవ్వకుండా కేవలం తల్లిపాలే అందించాలని మంత్రి స్పష్టం చేశారు.
ఆరు నెలల తర్వాత వయస్సుకు తగిన అనుబంధ ఆహారాన్ని ప్రారంభించినప్పటికీ, రెండేళ్ల వయస్సు వరకు తల్లిపాలను కొనసాగించడం వల్ల శిశువుల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు. తల్లిపాలు శిశువులకు సంపూర్ణ పోషకాహారంతో పాటు వ్యాధినిరోధక శక్తిని అందించి అనేక అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయని పేర్కొన్నారు.
గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లుల్లో తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించి, సరైన అవగాహన కల్పించేందుకు ఆరోగ్య, అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించి ప్రతి కుటుంబానికి తల్లిపాల ప్రాముఖ్యతను చేరవేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Post a Comment