ఓయూలో ఘనంగా డా. అన్నాభావు సాఠె 106వ జయంతి వేడుకలు
ఓయూలో ఘనంగా డా. అన్నాభావు సాఠె 106వ జయంతి వేడుకలు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో డా. సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాఠె 106వ జయంతి వేడుకలను మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాభావు సాఠె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలి యువ నేత అమృతం కళ్యాణ్, PDSU రాష్ట్ర అధ్యక్షుడు డా. నాగేశ్వర్ రావు, రాష్ట్ర కార్యదర్శి సుమంత్, BRSV నాయకుడు రామకృష్ణ, AISF ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ఓయూ నాయకుడు వి. నరసింహ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోకషాహీర్ అన్నాభావు సాఠె జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, విద్యతో ఎదుగుతూ సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి అన్నాభావు సాఠె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ మాట్లాడుతూ.. అత్యంత వెనుకబడిన మాంగ్ సమాజ్ అభివృద్ధి కోసం ప్రత్యేక మాంగ్ సమాజ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు గురుకుల విద్యాసంస్థల్లో ప్రత్యేక సీట్లు కేటాయించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలని, రిజర్వేషన్లలో న్యాయం చేయాలని కోరారు. మాంగ్ సమాజ్ మహనీయులకు తగిన గౌరవం కల్పించడంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే మాంగ్ రైతుల పాత పహాణి పత్రాలను పునరుద్ధరించి వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంబ్లే శంకర్ మాంగ్, హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు కె. సుధాకర్ మాంగ్, ప్రధాన కార్యదర్శి ఎస్. దిలీప్ మాంగ్, ఉపాధ్యక్షులు నామ్‌వాడ్ రమాకాంత్ మాంగ్, కేదాసే భానుదాస్ మాంగ్, కె. అనిల్ మాంగ్, ఎస్. పాండురంగ్ మాంగ్, కె. దయానంద్ మాంగ్, సి.హెచ్. ఉద్ధవ్ మాంగ్, ఎల్. నామ్ దేవ్ మాంగ్, విద్యార్థులు, మాంగ్ సమాజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment