ఇల్లందులో నోటీసులు ఇవ్వకుండా దుకాణాల కూల్చివేత.. ఉద్రిక్తత
ఇల్లందులో నోటీసులు ఇవ్వకుండా దుకాణాల కూల్చివేత.. ఉద్రిక్తత
ఇల్లందు, ఆగస్టు 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ అధికారులు శనివారం యంత్రాల సహాయంతో కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. గత ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నామని పేర్కొన్న చిరు వ్యాపారులు, తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా కూల్చివేతలు చేపట్టారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
వ్యాపారులకు మద్దతుగా పలు రాజకీయ పార్టీల నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారుల తీరును తప్పుబట్టారు. ఆక్రమణలు ఉన్నట్లయితే చట్ట ప్రకారం ముందుగా నోటీసులు జారీ చేసి, వ్యాపారులకు వివరణ ఇచ్చే అవకాశం కల్పించిన తర్వాత చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పట్టణంలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ, కేవలం పేద చిరు వ్యాపారుల దుకాణాలపైనే చర్యలు చేపట్టడం అన్యాయమని విమర్శించారు.
పేదల జీవనోపాధిని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరించడం సరికాదని, ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కార్యాచరణ రూపొందించి పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. కూల్చివేతల సమయంలో మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారులతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసుల బందోబస్తు మధ్య మున్సిపల్ సిబ్బంది కూల్చివేతలను కొనసాగించారు.
ఈ నిరసన కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు దిండిగల రాజేందర్, నబి, తుపాకుల నాగేశ్వరరావు, బాలగాని గోపి, మావూరి మాధవ్, ఎస్.కే. జానీ, ఎస్.డి. జానీ పాషా తదితరులు పాల్గొని వ్యాపారులకు సంఘీభావం తెలిపారు.

Post a Comment