రూ.164 కోట్లతో మంథనిలో అభివృద్ధి పనులు: మంత్రి శ్రీధర్ బాబు
రూ.164 కోట్లతో మంథనిలో అభివృద్ధి పనులు: మంత్రి శ్రీధర్ బాబు
మంథని, ఆగస్టు 19: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
మంథనిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు ఉమ్మడిగా పాల్గొని రూ.164 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు శ్రీకారం చుట్టారు. మంథని బ్రిడ్జి రోడ్డు నుంచి బస్సు డిపో వరకు రూ.15 కోట్లతో రోడ్డు విస్తరణ, డ్రెయినేజీ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గత రెండేళ్లలో మంథని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం దాదాపు రూ.800 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. అందులో భాగంగానే తాజాగా రూ.164 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు శంకుస్థాపనలు చేసినట్లు చెప్పారు.
గోదావరి నదిపై ప్రతిపాదిత వంతెన నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని మంత్రి వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మంథని ప్రాంతానికి విశేష సేవలందించిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ స్పీకర్ శ్రీపాదరావు సేవలను స్మరించుకున్నారు. మంథని నియోజకవర్గ అభివృద్ధికి రూ.800 కోట్ల నిధులు కేటాయించడం శుభపరిణామమని అన్నారు.
యువతకు ఉపాధి, సాంకేతిక శిక్షణ అవకాశాలను మరింత విస్తరించేందుకు మంథనిలో రూ.20 కోట్ల వ్యయంతో న్యాక్ (NAC) సెంటర్‌ను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కేంద్రం ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Post a Comment