సింగరేణిలో మారుపేర్లు 74 గంటల ఆమరణ నిరాహార దీక్షకు ముగింపు
సింగరేణిలో మారుపేర్లు 74 గంటల ఆమరణ నిరాహార దీక్షకు ముగింపు
ఎమ్మెల్యే సాంబశివరావు జోక్యంతో సింగరేణి అధికారుల హామీ
కొత్తగూడెం, ఆగస్టు 17: సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను పరిష్కరించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లక్కా శ్రావణ్ గౌడ్ నాయకత్వంలో ఎనిమిది మంది బాధితులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 74 గంటల అనంతరం ముగిసింది. కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు జోక్యంతో సింగరేణి యాజమాన్యం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు దీక్ష విరమించారు.
సుదీర్ఘంగా దీక్ష కొనసాగడంతో లక్కా శ్రావణ్ గౌడ్, షేక్ బాబర్, ఆకుల సాయికిరణ్ తదితరుల ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. బీపీ తగ్గడంతో పాటు జ్వరం, నీరసం వంటి సమస్యలతో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హెడ్‌ఆఫీస్ ఎదుట బాధితుల ఆందోళన
బాధితుల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం నుంచి సరైన స్పందన రావడం లేదని ఆరోపిస్తూ మారుపేర్ల బాధితులు కొత్తగూడెంలోని సింగరేణి హెడ్‌ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది కార్యాలయంలోకి వెళ్లే విషయంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. భద్రతా సిబ్బంది (ఎస్‌అండ్‌పీ), బాధితుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
దీక్షలో ఉన్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు వెంటనే దీక్షా శిబిరానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారి సమస్యలు, డిమాండ్లను స్వయంగా విన్నారు.
అనంతరం ఎమ్మెల్యే సింగరేణి ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితుల సమస్యపై తక్షణమే స్పందించాలని, పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.
నెల రోజుల్లో పరిష్కారానికి హామీ
ఎమ్మెల్యే జోక్యంతో సింగరేణి జీఎం పర్సనల్ విభాగానికి చెందిన కిరణ్ దీక్షా శిబిరానికి చేరుకుని బాధితులతో చర్చించారు. వారి సమస్యలు, డిమాండ్లను నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా సింగరేణి తరఫున త్వరలో కమిటీ నిర్ణయం తీసుకుని, నెల రోజుల కాలపరిమితిలో సమస్యకు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.
నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేసిన ఎమ్మెల్యే
సింగరేణి అధికారి హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే సాంబశివరావు బాధితులను దీక్ష విరమించాలని కోరారు. సమస్య పరిష్కారం దిశగా యాజమాన్యం నుంచి హామీ రావడంతో బాధితులు ఎమ్మెల్యే విజ్ఞప్తికి అంగీకరించారు.
అనంతరం ఎమ్మెల్యే సాంబశివరావు స్వయంగా దీక్షాకారులకు నిమ్మరసం తాగించి 74 గంటలుగా కొనసాగుతున్న ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేశారు.
ఎమ్మెల్యేకు బాధితుల కృతజ్ఞతలు
తమ ఆరోగ్య పరిస్థితి క్షీణించిన సమయంలో స్పందించి దీక్షా శిబిరానికి చేరుకోవడంతో పాటు సింగరేణి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యపై స్పందన తీసుకువచ్చిన ఎమ్మెల్యే సాంబశివరావుకు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి షాబిర్ పాషాకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
ఈ దీక్షకు సింగరేణి కార్మికులు, కార్మికుల తల్లిదండ్రులు, వివిధ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.
హామీ అమలు చేయాలి
సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీని ఇక కాలయాపన చేయకుండా అమలు చేసి, మారుపేర్ల బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చే వరకు తమ సమస్యపై పోరాటం కొనసాగుతుందని సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితుల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్ స్పష్టం చేశారు.

Post a Comment