-->

బర్త్‌డే రోజే విషాదం.. చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

బర్త్‌డే రోజే విషాదం.. చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
బర్త్‌డే రోజే విషాదం.. చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

రాజ్‌కోట్: పుట్టినరోజు వేడుకను ఆనందంగా జరుపుకునేందుకు వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బర్త్‌డే రోజే చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు, ఓ యువకుడు సహా నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా బేడీ గ్రామం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

బేడీ గ్రామం సమీపంలోని విడివాలా పీర్ దర్గా వద్దకు ఓ బాలుడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు వెళ్లారు. దర్గాలో ప్రార్థనలు పూర్తి చేసుకున్న అనంతరం సమీపంలోని నీటి గుండం వద్దకు వెళ్లి సరదాగా గడుపుతూ స్నానానికి దిగారు.

ఈ క్రమంలో నీటిలో ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి జారిపడి మునిగిపోయాడు. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు నీటిలోకి వెళ్లడంతో పరిస్థితి విషమించింది. నీటి ఉధృతికి నలుగురూ మునిగిపోయారు.

వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని నీటిలో నుంచి నలుగురినీ బయటకు తీశారు. అనంతరం చికిత్స కోసం రాజ్‌కోట్ సివిల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న కువాడ్వా రోడ్డు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లిన కుటుంబంలో క్షణాల్లోనే పెను విషాదం చోటుచేసుకోవడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793