కరీంనగర్‌లో పాడి రైతుల కదం తొక్కిన కలెక్టరేట్ వరకు ర్యాలీ నిరసన
కరీంనగర్‌లో పాడి రైతుల కదం తొక్కిన కలెక్టరేట్ వరకు ర్యాలీ నిరసన
కరీంనగర్ డైరీకి సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాడి రైతులు భారీ ఆందోళన చేపట్టారు. సుమారు 2 వేల మంది పాడి రైతులు పద్మనగర్‌లోని కరీంనగర్ డైరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
పాడి రైతులు మాట్లాడుతూ.. కరీంనగర్ డైరీకి సంబంధించిన భూములను ధరణి పోర్టల్ నుంచి తొలగించి, భూభారతి వ్యవస్థలో తెలంగాణ ఫెడరేషన్ పేరుపైకి మార్చారని ఆరోపించారు. డైరీని నమ్ముకుని లక్షలాది పాడి రైతుల కుటుంబాలు జీవిస్తున్నాయని, అలాంటి సంస్థకు సంబంధించిన భూములను వెంటనే డైరీ పేరుపై తిరిగి నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాడి రైతులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై రెండు గేదెలను అందించాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కరీంనగర్ డైరీ పాలనే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల నుంచి పాలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, పాడి పరిశ్రమను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పాడి రైతులు ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరీంనగర్ డైరీపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు ఇబ్బందుల్లో పడకుండా తక్షణమే సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 2 వేల మంది పాడి రైతులు పాల్గొన్నారు.

Post a Comment