-->

తాళి కట్టే సమయంలో పెళ్లి వద్దన్న వధువు.. నిలిచిపోయిన వివాహం

 

తాళి కట్టే సమయంలో పెళ్లి వద్దన్న వధువు.. నిలిచిపోయిన వివాహం

తాళి కట్టే సమయంలో పెళ్లి వద్దన్న వధువు.. నిలిచిపోయిన వివాహం

నాగర్‌కర్నూల్ జిల్లాలో అనూహ్య ఘటన

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పెళ్లి పీటలపై తాళి కట్టే సమయానికి వధువు తనకు ఈ వివాహం ఇష్టం లేదని స్పష్టం చేయడంతో వివాహం అర్ధంతరంగా నిలిచిపోయింది. లింగాల మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

బిజినేపల్లి మండలానికి చెందిన యువకుడికి, లింగాల మండలానికి చెందిన యువతికి సుమారు రెండు నెలల క్రితం ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం నిశ్చయమైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు లింగాలలోని ఓ కల్యాణ మండపంలో వివాహానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. బంధుమిత్రులు, అతిథుల సమక్షంలో వివాహ వేడుకలు అట్టహాసంగా కొనసాగాయి.

అయితే వరుడు తాళి కట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో వధువు ఒక్కసారిగా అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తేల్చిచెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెకు నచ్చజెప్పేందుకు ఎంతగా ప్రయత్నించినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

ఈ అనూహ్య పరిణామంతో ఇరు కుటుంబాల మధ్య గందరగోళం నెలకొంది. చివరకు పెళ్లి ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చులను వధువు తండ్రే భరించాలని పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం.

ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. అయితే ఇరువర్గాలు కులపెద్దల సమక్షంలో చర్చించుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. పెళ్లి పీటలపైనే వధువు వివాహానికి నిరాకరించడంతో ఈ ఘటన లింగాల మండలంలో చర్చనీయాంశంగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793