-->

డబ్బు, బంగారం కోసం వరుస హత్యలు.. లేడీ కిల్లర్ అరెస్ట్

 

డబ్బు, బంగారం కోసం వరుస హత్యలు.. లేడీ కిల్లర్ అరెస్ట్

డబ్బు, బంగారం కోసం వరుస హత్యలు.. లేడీ కిల్లర్ అరెస్ట్

సిద్దిపేట జిల్లాలో డబ్బు, బంగారం కోసం ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తన మైనర్ కుమారుడిని కూడా హత్యలకు సిద్ధం చేస్తూ, దుకాణంలోనే జిమ్ ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆదివారం సీపీ రష్మీ పెరుమాళ్, ఏసీపీ రవీందర్‌రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారులో ఈ నెల 8న రోడ్డు పక్కన పాక్షికంగా కాలిపోయిన మహిళ మృతదేహం గుర్తించారు. దర్యాప్తులో మృతురాలిని భూంపల్లిలోని డబుల్ బెడ్రూం కాలనీలో నివసించే అతికం విజయ (45)గా గుర్తించారు.

సీసీ కెమెరాల ఆధారంగా భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత, ఆమె మైనర్ కుమారుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రజిత స్థానికంగా కిరాణా దుకాణం, టీ స్టాల్ నిర్వహిస్తోంది. ఆమె భర్త అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఉన్నాడు.

ఒంటరి మహిళలే టార్గెట్

డబ్బు, బంగారం కోసం ఒంటరిగా ఉండే మహిళలను హత్య చేసి, వారి ఆభరణాలను దోచుకుని విక్రయించాలని రజిత తన కుమారుడితో కలిసి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 8న తన దుకాణానికి వచ్చిన అతికం విజయను ముందస్తు ప్రణాళిక ప్రకారం లోపలికి పిలిచి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని, అదే రోజు రాత్రి మృతదేహాన్ని ఎక్స్‌ఎల్ వాహనంపై రామక్కపేట శివారుకు తరలించి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు.

అంతకుముందు ఈ ఏడాది మే 28న తమ ఇంటి సమీపంలో నివసించే కుంట రేఖను కూడా కిరాణా దుకాణానికి పిలిచి హత్య చేసి, మృతదేహాన్ని అచ్చుమాయిపల్లి గ్రామ శివారులో కాల్చివేసినట్లు విచారణలో తేలింది.

2025 జూన్‌లో భూంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ఉదయం వాకింగ్‌కు వెళ్తుండగా ఆమెపై దాడి చేసి సుమారు 5 తులాల బంగారు పుస్తెలతాడును దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇంకా మరో నలుగురు మహిళలను హత్య చేసి వారి నుంచి బంగారు ఆభరణాలు దోచుకోవాలని రజిత ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.

భర్తను కూడా హత్య చేసేందుకు ప్లాన్

అనారోగ్యంతో మంచానికే పరిమితమైన తన భర్తను కూడా హత్య చేయాలని రజిత ప్రణాళిక రచించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం ముందుగా భర్తకు ఇన్సూరెన్స్ చేయించి, అనంతరం హత్య చేయాలనే ఆలోచన చేసినట్లు తెలిపారు.

కుమారుడికి జిమ్ ఏర్పాటు

హత్యలకు తన మైనర్ కుమారుడిని సిద్ధం చేసేందుకు రజిత ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం తాను నిర్వహిస్తున్న దుకాణంలోనే జిమ్ ఏర్పాటు చేసి, కుమారుడితో నిత్యం వ్యాయామం చేయించేదని చెప్పారు. దుకాణంలో పలు రకాల వ్యాయామ పరికరాలను పోలీసులు గుర్తించారు.

నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు, వాహనం, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793