-->

బోనాల ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్.. 19 ఏళ్ల యువకుడు మృతి

 

బోనాల ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్.. 19 ఏళ్ల యువకుడు మృతి

బోనాల ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్.. 19 ఏళ్ల యువకుడు మృతి

నర్సాపూర్, ఆగస్టు 7: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బోనాల పండుగ ఏర్పాట్ల సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో 19 ఏళ్ల యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు.

స్థానికుల వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణానికి చెందిన మల్పర్తి హర్షవర్ధన్ (19) శుక్రవారం తెల్లవారుజామున పట్టణంలోని శివాలయం వద్ద బోనాల పండుగకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్లెక్సీ కట్టేందుకు ఉపయోగిస్తున్న ఇనుప పైపు ప్రమాదవశాత్తు పై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను తాకడంతో అతడికి తీవ్ర విద్యుత్ షాక్ తగిలింది. దీంతో హర్షవర్ధన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

అతడిని వెంటనే స్థానికులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అదే ఘటనలో మరో ఇద్దరు యువకులు కూడా విద్యుత్ షాక్‌కు గురై గాయపడగా, వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బోనాల పండుగకు ముందు చోటుచేసుకున్న ఈ విషాద ఘటన నర్సాపూర్ పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు పండుగల సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, ఇనుప పైపుల వినియోగంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.