లోతువాగులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
లోతువాగులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
గ్రామాభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కోసం ఐక్యంగా పోరాడదాం: అఖిలపక్ష నాయకులు
లక్ష్మీదేవిపల్లి: మండలంలోని లోతువాగు గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు పూణెం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎందరో మహానీయులు, స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలు, వారి కృషి, సంకల్పం, పట్టుదల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛాయుత జీవనం గడుపుతున్నారని అన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గ భేదాలకు అతీతంగా లోతువాగు గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అటవీ–రెవెన్యూ భూ సమస్య పరిష్కరించాలి
లోతువాగు గ్రామంలో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అటవీ–రెవెన్యూ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నాయకులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కోసం గ్రామ ప్రజలు ఓపికతో, ఐక్యంగా ఉండాలని, హక్కుల సాధనకు కలిసికట్టుగా పోరాడాలని కోరారు.
గ్రామంలో మౌలిక వసతులు, ప్రజా సదుపాయాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునేలా కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే నిర్మించుకున్న గృహాలకు ఎలాంటి షరతులు లేకుండా ఇంటి నంబర్లు, విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని కోరారు.
అదేవిధంగా గ్రామంలో సీసీ రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం, మెరుగైన తాగునీటి సరఫరా, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను విజ్ఞప్తి చేశారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి
గ్రామంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. అర్హులైన వారికి నూతన పింఛన్లు కూడా మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షురాలు కుంజ హైమవతి, బీఆర్‌ఎస్ నాయకులు తాటి సునీత యాదగిరి, సీపీఐ నాయకులు రావుల నర్సయ్య, ప్రజా సంఘాల నాయకులు పల్లపు జయరాజు, తాటి రాజు, వార్డు సభ్యులు పూనెం వెంకటేశ్వర్లు, పూనెం రాములు, ప్రజా సంఘాల ప్రతినిధులు కంఠత్మకూరి శ్రీను మేస్త్రి, రాకేష్, మణెమ్మ, ధీటి సంజీవ్, బోడ చంటి, బుజ్జి, బోడ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వేడుకల్లో చిన్నారులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

Post a Comment