-->

జీవో 97 రద్దు చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి

జీవో 97 రద్దు చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి


జీవో 97 రద్దు చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి

కరీంనగర్, ఆగస్టు 21: పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్‌ఐ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆందోళనలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తీసుకొస్తున్న విధానాల ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయమని విమర్శించారు.

పాలిటెక్నిక్ విద్య ప్రత్యేకమైన సాంకేతిక విద్యా వ్యవస్థ అని, దాని ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా డిప్లొమా కోర్సులను ఇతర శిక్షణా కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదన్నారు.

జీవో 97 అమలుతో పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఉన్నత విద్యకు ఉన్న అవకాశాలు, ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను బలోపేతం చేయడంతో పాటు, అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్‌ఐ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793