మహంకాళి బోనాల జాతరలో శక్తి వేషధారణల సందడి.. వైభవంగా రథయాత్ర
మహంకాళి బోనాల జాతరలో శక్తి వేషధారణల సందడి.. వైభవంగా రథయాత్ర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డలో వెలసిన శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢమాస బోనాల జాతర వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. కాళీ ఉపాసకులు నరేంద్ర భవాని స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాతరలో శుక్రవారం శక్తి వేషధారణలు, సాంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు, రథయాత్ర భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారి రథయాత్రను ఘనంగా నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జై మహంకాళి నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
రథయాత్రలో మహంకాళి అమ్మవారి వేషధారణలో కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పు, డోలు వాయిద్యాల మేళతాళాలకు అనుగుణంగా కళాకారులు చేసిన శక్తి వేషాలు భక్తులను విశేషంగా అలరించాయి. కళాబృందాల డప్పు నృత్యాలు జాతరకు మరింత శోభను తీసుకువచ్చాయి.
రథయాత్ర సాగిన మార్గమంతా భక్తులు అమ్మవారికి హారతులు ఇస్తూ, పూలతో స్వాగతం పలికారు. మహిళలు, యువత, చిన్నారులు సైతం పెద్ద ఎత్తున పాల్గొని భక్తి భావాన్ని చాటుకున్నారు. భక్తుల జైజైధ్వానాలు, సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు, డప్పు వాయిద్యాల నడుమ రథయాత్ర ఉత్సాహభరితంగా కొనసాగి విజయవంతంగా ముగిసింది.
ఈ జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు అమ్మవారి ఆశీర్వాదాలు పొందేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం కార్యక్రమం భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఘనంగా జరిగింది.

Post a Comment