జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. కారు దగ్ధం, ఇద్దరు మృతి
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. కారు దగ్ధం, ఇద్దరు మృతి
చింతూరు: పోలవరం జిల్లా చింతూరు మండలంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొడ్డుగూడెం–విద్యానగరం గ్రామాల మధ్య జాతీయ రహదారి-30పై లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదం అనంతరం కారులో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం నుంచి ఇద్దరు వ్యక్తులు కారులో చింతూరు వైపు వస్తుండగా, ఒడిశా నుంచి చింతూరు మీదుగా భద్రాచలం వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చింది. బొడ్డుగూడెం–విద్యానగరం మధ్య జాతీయ రహదారిపై ఉన్న మూలమలుపు వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి.
ఢీకొన్న అనంతరం లారీ కారును కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న ఇద్దరిలో ఒకరు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.
ప్రమాద సమాచారం అందుకున్న చింతూరు సీఐ గోపాలకృష్ణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment