-->

కొత్తగూడెంలో వైభవంగా బూడిదగడ్డ బస్తీ మహంకాళి బోనాలు

 

మహంకాళీ బోనాలు జాతరలో మహాచండీ హోమము నరేంద్ర భవాని

కొత్తగూడెంలో వైభవంగా బూడిదగడ్డ బస్తీ మహంకాళి బోనాలు

కొత్తగూడెం, ఆగస్టు 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బూడిదగడ్డ బస్తీలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

జాతర సందర్భంగా ఆలయంలో నరేంద్ర భవాని ఆధ్వర్యంలో పూజారులు కటకం సాయి ప్రవీణ్ శర్మ, చావలి భాను కుమార్ శర్మ, కపిలవాయి అనిల్ కుమార్ శర్మ, రఘునాథ ఆచార్యులు ప్రత్యేక పూజలు, చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలు ఆలయానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి.

కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తలపై బోనాలతో ఊరేగింపుగా వచ్చి డీజే సౌండ్లు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి బోనాలు సమర్పించారు. శివసత్తుల పూనకాలు, భక్తుల నృత్యాలు, హారతులు, జై మహంకాళి నినాదాలతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మార్మోగింది.

ఈ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక తీర్థప్రసాదాలు అందజేశారు.

జాతర సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బాల పాసి, సత్యనారాయణ పాసి, హీరా పాసి, బాబా దిన్ పాసి ఆధ్వర్యంలో భక్తుల కోసం భారీ స్థాయిలో 'నారాయణ సేవ' మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించగా, బౌన్సర్లు క్యూలైన్ల ద్వారా భక్తులను క్రమపద్ధతిలో దర్శనానికి పంపిస్తూ సాఫీగా అమ్మవారి దర్శనం జరిగేలా చర్యలు చేపట్టారు. మొత్తం జాతర ప్రశాంత వాతావరణంలో, భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా ముగిసింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793