తెలంగాణకు 2 లక్షల ఇళ్లు మంజూరు.. సీఎం రేవంత్‌రెడ్డికి పత్రం అందజేసిన కేంద్ర మంత్రి
తెలంగాణకు 2 లక్షల ఇళ్లు మంజూరు.. సీఎం రేవంత్‌రెడ్డికి పత్రం అందజేసిన కేంద్ర మంత్రి
హైదరాబాద్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) పథకం కింద రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంజూరు పత్రాన్ని అందజేశారు.
మంజూరైన ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.72 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. గ్రామీణ కోటా కింద తెలంగాణకు ఇళ్ల మంజూరు జరగడం సుమారు తొమ్మిదేళ్ల తర్వాత కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇళ్ల మంజూరుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తగిన స్పందన లేకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు గ్రామీణ గృహాల కేటాయింపుపై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు తెలిపాయి.
తాజా మంజూరుతో గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. కేంద్రం నుంచి మంజూరైన ఈ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.

Post a Comment