-->

పెద్దపల్లి జిల్లాలో ‘క్షుద్రపూజల’ కలకలం.. రోడ్డుపై బూడిద, తెల్లటి పొడి

పెద్దపల్లి జిల్లాలో ‘క్షుద్రపూజల’ కలకలం.. రోడ్డుపై బూడిద, తెల్లటి పొడి
పెద్దపల్లి జిల్లాలో ‘క్షుద్రపూజల’ కలకలం.. రోడ్డుపై బూడిద, తెల్లటి పొడి

పెద్దపల్లి: జిల్లాలోని పాలితం గ్రామపంచాయతీ పరిధి పుట్టపల్లి ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డుపై కనిపించిన కొన్ని ఆనవాళ్లు స్థానికంగా కలకలం రేపాయి. పెద్దపల్లి–ధర్మారం–చొప్పదండి ప్రధాన రహదారిపై బస్టాండ్ సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని వస్తువులు ఉంచి నిప్పు పెట్టినట్లు ఆనవాళ్లు కనిపించాయి.

రోడ్డు మధ్యలో బూడిద, పెంకులు, తెల్లటి పొడి చల్లినట్లు కనిపించడంతో వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటనపై చర్చ జరుగుతోంది.

క్షుద్రపూజలా.. ఆకతాయిల పనా?

రోడ్డుపై నిప్పు పెట్టిన ఆనవాళ్లు ఉండటంతో కొందరు స్థానికులు ఇది క్షుద్రపూజలకు సంబంధించిన వ్యవహారమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆకతాయిలు కావాలనే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇలా చేసి ఉండవచ్చని చెబుతున్నారు.

అయితే, రోడ్డుపై కనిపించిన వస్తువులను బట్టి ఇది క్షుద్రపూజలేనని నిర్ధారించలేం. ఘటన వెనుక అసలు కారణం ఏమిటన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

ప్రధాన రహదారి కావడంతో ఇలాంటి వస్తువులను రోడ్డుపై ఉంచడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో పాటు ప్రమాదాలకు కూడా అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఘటనపై పోలీసులు దృష్టి సారించి, రోడ్డుపై వస్తువులు ఎవరు ఉంచారు? ఎందుకు నిప్పు పెట్టారు? అనే అంశాలపై విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.