కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. రెండు ఎస్బీఐ ఏటీఎంలు చోరీ
కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. రెండు ఎస్బీఐ ఏటీఎంలు చోరీ
కరీంనగర్: జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు తెల్లవారుజామున రెండు వేర్వేరు ప్రాంతాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన దుండగులు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేయడం, వాటిపై స్ప్రే కొట్టడం వంటి చర్యలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు.
దురిషేడ్‌లో గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం చోరీ
కరీంనగర్ జిల్లా దురిషేడ్‌లోని ఎస్బీఐ ఏటీఎంను ముగ్గురు దుండగులు టార్గెట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో స్కార్పియో వాహనంలో వచ్చిన వారు ఏటీఎంలోకి ప్రవేశించారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.
అనంతరం గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి ఏటీఎం క్యాష్ మిషన్‌ను కట్ చేసి అందులోని నగదును అపహరించారు. చోరీ అనంతరం అదే స్కార్పియో వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు.
తిమ్మాపూర్‌లో లేడీ గెటప్‌లో వచ్చి..
ఇదే సమయంలో తిమ్మాపూర్‌లోని మరో ఎస్బీఐ ఏటీఎంలోనూ దుండగులు చోరీకి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో వారు అనుసరించిన పద్ధతి ప్రత్యేకంగా ఉంది. దుండగులు లేడీ గెటప్‌లో ఏటీఎంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
లోపలికి వెళ్లిన అనంతరం సీసీటీవీ కెమెరాలపై స్ప్రే కొట్టి, తమ కదలికలు కెమెరాల్లో స్పష్టంగా రికార్డు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు.
ఒకే ముఠానా? వేర్వేరా?
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో దాదాపు ఒకే సమయంలో ఎస్బీఐ ఏటీఎంలను లక్ష్యంగా చేసుకోవడం, ముందస్తు ప్రణాళికతో సీసీటీవీలను నిర్వీర్యం చేయడం కలకలం రేపింది. ఈ రెండు ఘటనల వెనుక ఒకే ముఠా ఉందా? లేక వేర్వేరు ముఠాలు చోరీలకు పాల్పడ్డాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలాలకు చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. స్థానిక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల కదలికలను ట్రేస్ చేస్తున్నారు. చోరీలకు ఉపయోగించిన వాహనం ఎటువైపు వెళ్లింది? ఘటనలకు ముందు, తర్వాత దుండగులు ఎక్కడ సంచరించారు? అనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు. కేసులు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. :::

Post a Comment