హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై హోంగార్డ్ దాడి ఘటనలో హోంగార్డ్ అరెస్ట్
హైదరాబాద్: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై హోంగార్డ్ దాడి చేసిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై స్పందించిన సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి, హోంగార్డ్ ఆనంద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం అతడిని విధుల నుంచి తొలగించి, రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో మహిళతో హోంగార్డ్‌కు వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో హోంగార్డ్ ఆనంద్ మహిళపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మహిళను కొట్టడంతో పాటు జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు ఘటనపై దృష్టి సారించారు.
హోంగార్డ్ ఆనంద్ హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన అనంతరం రైల్వే అధికారులు అతడిని తెలంగాణ పోలీస్ శాఖకు తిరిగి పంపించినట్లు సమాచారం.
మహిళపై దాడికి సంబంధించి పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఘటనపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించినట్లు సమాచారం.

Post a Comment