-->

స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి.. తాతా మధు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం

 

స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి.. తాతా మధు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం

స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి.. తాతా మధు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో సోమవారం ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

స్పీకర్ తల్లిని ఉద్దేశించి అవమానకరంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ పదవికి, ఆయన కుటుంబానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె పేర్కొన్నారు.

తాతా మధు వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండిస్తూ సభలోనే కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె ఆవేదనను చూసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ కూడా భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక కంటతడి పెట్టుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

అనంతరం గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో శాసనసభను కొద్దిసేపు వాయిదా వేశారు.

సభ వాయిదా అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ భావోద్వేగానికి కారణాన్ని వివరించారు. “మంత్రి సీతక్క గత ఐదేళ్లుగా నన్ను సొంత అన్నలా భావించి రాఖీ కడుతున్నారు. అలాంటి సోదరి నా కోసం సభలో కన్నీరు పెట్టుకుంటే నాకు దుఃఖం ఆగలేదు. అందుకే నేను కూడా భావోద్వేగానికి గురయ్యాను” అని తెలిపారు.

ప్రజాస్వామ్య దేవాలయమైన శాసనసభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పీకర్ పేర్కొన్నారు. తాతా మధు చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేసి, తదుపరి చర్యల నిమిత్తం ఆ తీర్మానాన్ని శాసనమండలికి పంపిస్తామని స్పష్టం చేశారు.

ఈ ఘటనతో తెలంగాణ అసెంబ్లీ వేదికగా రాజకీయ విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యలపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

Blogger ఆధారితం.