గణేష్ ఊరేగింపులో భర్త మరో మహిళతో నృత్యం.. భార్య ఆత్మహత్య
గణేష్ ఊరేగింపులో భర్త మరో మహిళతో నృత్యం.. భార్య ఆత్మహత్య
మంచిర్యాల: వినాయక నిమజ్జనోత్సవంలో భర్త మరో మహిళతో కలిసి నృత్యం చేయడాన్ని చూసి మనస్తాపానికి గురైన ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దొడ్డిగూడలో ఈ ఘటన జరిగింది.
దేవాపూర్ ఎస్సై గంగారాం, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. దొడ్డిగూడ సమీపంలోని సోనాపూర్‌లో ఈ నెల 23న రాత్రి వినాయక నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డిగూడకు చెందిన రాయిసిడాం సంధ్య (23) భర్త జంగు మద్యం మత్తులో మరో యువతితో కలిసి నృత్యం చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన సంధ్య తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మరుసటి రోజు (24న) ఉదయం జంగు సోనాపూర్‌లోని వినాయక మండపాన్ని తొలగించేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సంధ్య క్షణికావేశంలో పురుగుల మందు తాగింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
అయితే చికిత్స పొందుతూ సంధ్య శుక్రవారం ఉదయం మృతి చెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు.

Post a Comment