నిమజ్జన బందోబస్తులో విషాదం.. బైక్ ఢీకొని ఎస్‌ఐ మృతి
నిమజ్జన బందోబస్తులో విషాదం.. బైక్ ఢీకొని ఎస్‌ఐ మృతి
హైదరాబాద్: గణేశ్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న ఓ పోలీస్ ఎస్‌ఐ బైక్ ఢీకొట్టడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఎస్‌ఐ చికిత్స పొందుతూ మృతి చెందారు.
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కిన్నెర వెంకన్న (55) మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ మార్గ్‌లో గణేశ్ నిమజ్జన బందోబస్తు విధులకు హాజరయ్యారు. క్రేన్ నంబర్–2 వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని బైకర్ వెంకన్నను ఢీకొట్టి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్దగా గాయాలు కాలేదని భావించిన ఆయన విశ్రాంతి తీసుకునేందుకు స్వగ్రామానికి బయలుదేరారు. వారంగల్ చేరుకున్న అనంతరం ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ బుధవారం వెంకన్న మృతి చెందారు. దీంతో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని బైకర్‌ను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment